Mana Enadu : పరమేశ్వరులకు కార్తిక మాసం(Kartika Masam) ఎంతో ప్రీతికరమైనది. అందులోనూ కార్తిక పౌర్ణమి పర్వదినం చాలా ప్రాముఖ్యమైనది. కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలో వచ్చే కార్తిక పౌర్ణమి రోజున కొన్ని విధివిధానాలు పాటిస్తూ పూజలు నిర్వహించడం వల్ల కష్టాలు, గ్రహ దోషాలు తొలగిపోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. మరి ఆ పూజా విధానం ఏంటంటే..?
కార్తిక పౌర్ణమి (Kartika Purnami) రోజు ఉదయాన్నే సముద్ర స్నానం చేయడం వల్ల దృష్టి దోషం, నరపీడా నుంచి తప్పించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఆరోజు దీప దానం కూడా చేయాలని.. దేవాలయ ప్రాంగణంలో గానీ లేదా ఇంట్లో.. 365 వత్తులతో లేదా 720 వత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందంటున్నారు.
ఆర్థిక సమస్యలు తొలగాలంటే
ఇక ఈరోజు ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపం (Kartika Deepam) వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే కార్తిక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కంధ పురాణం వైష్ణవ ఖండంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. అయితే కార్తిక పౌర్ణమి రోజు కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించడం ద్వారా అనంతమైన పుణ్యం లభిస్తుందని తెలిపారు.
ఇక అమ్మాయిలకు మంచి భర్త రావాలంటే..
పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కార్తిక పౌర్ణమి రోజు తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచి రాధాకృష్ణుల ఫొటో పెట్టి దీపం వెలిగించి రకరకాల పుష్పాలు, తీయని నైవేద్యాలను సమర్పించాలి. ఇలా చేస్తే మంచి వ్యక్తితో వివాహం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.






