ఐపీఎల్ మెగా వేలం(IPL Mega Auction) ముగిసింది. అన్ని జట్లు తమ తమ బడ్జెట్లో నచ్చిన ప్లేయర్లను రూ. కోట్లు వెచ్చించి మరీ దక్కించుకున్నాయి. మరోవైపు స్టార్ ప్లేయర్ల(Star Players)కు ఈ సారి అదృష్టం దక్కపోగా.. కనీసం ఫ్రాంచైజీలు వారి పేర్లు వచ్చినప్పుడూ పట్టించుకోనూ లేదు. స్వదేశీ క్రికెటర్లతోపాటు వరల్డ్ క్లాస్ ఫారిన్ క్రికెటర్లు అమ్ముడుపోకపోవడమే ఇందుకు నిదర్శనం. స్టీవ్ స్మిత్(Steve Smith), డారిల్ మిచెల్, ఆదిల్ రషీద్, అల్జారీ జోసెఫ్, జేసన్ హోల్డర్, మహ్మద్ నబీ, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్(Kane Williamson), డేవిడ్ వార్నర్(David Warner), జానీ బెయిర్‌స్టో వంటి టాప్ ప్లేయర్లు ఈసారి అన్‌సోల్డ్(Unsold)గా మిగిలిపోయారు.
అతడి టాలెంట్‌ను చూసి తీసుకున్నాం: ద్రవిడ్
అయితే ఈసారి వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అత్యంత పిన్న వయస్కుడిగా రాజస్థాన్ రాయల్స్(RR)కు ఎంపికైన వైభవ్ రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి అడుగుపెట్టగా ఢిల్లీ క్యాపిటల్స్(DC), రాజస్థాన్ రాయల్స్(RR) జట్లు పోటీ పడ్డాయి. చివరికి రాజస్థాన్ అతడిని రూ.1.10 కోట్లకు సొంతం చేసుకుంది. వైభవ్ ఎంపికపై RR హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్పందించాడు. “సెలక్షన్ ట్రయల్స్‌లో వైభవ్ తన ప్రతిభతో అద్భుతంగా రాణించాడు. అతడి ఆటలో ఉన్న నైపుణ్యం, క్రమశిక్షణ మనకు ఆహ్లాదకరంగా అనిపించాయి. ఈ వయసులోనే అతడిలో ఉన్న టాలెంట్‌ను చూసి జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాం” అని ద్రవిడ్ తెలిపారు.
అతడి వయసుపై సందేహం వద్దు: వైభవ్ తండ్రి
వైభవ్ తండ్రి సంజీవ్(Sanjeev) మాట్లాడుతూ “ప్రస్తుతం అతడు అండర్-19 ఆసియా కప్ కోసం దుబాయ్‌లో ఉన్నాడు. నాగ్‌పూర్‌లో జరిగిన ట్రయల్స్‌లో అతడు ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్(Batting coach Vikram Rathore) సూచన మేరకు ఒకే ఓవర్‌లో 17 పరుగులు చేయాలని టార్గెట్ ఇవ్వగా, అతడు మూడు సిక్సర్లు బాది దాన్ని సునాయాసంగా సాధించాడు,” అన్నారు. మరోవైపు వైభవ్ వయసు(Age) విషయంలో వస్తున్న ఆరోపణలను ఆయన తండ్రి ఖండించారు. అతడు 13 ఏళ్ల వయస్కుడే. ఈ వయసును నిర్ధారించడానికి BCCI నిర్వహించిన ఎముక పరీక్షల్లో(Bone Test)నూ ఇదే స్పష్టమైందని తెలిపారు. మరి ఈ కుర్రాడు IPLలో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.








