అయోధ్య శ్రీ బాలక్ రామ్ మందిరం(Ayodhya Ram Mandir)లోకి అనుమతిపై తాజాగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక ప్రకటన జారీ చేసింది. రామాలయ పూజారుల్లో ఎవరి కుటుంబంలోనైనా జనన, మరణాలు సంభవించినప్పుడు మలిన పడిపోయిన ఆ పూజారి రామ మందిరంలోకి ప్రవేశించడం పూర్తిగా నిషిద్ధమని పేర్కొంది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Ayodhya Rama Trust) సభ్యుడు అనిల్ మిశ్రా ప్రకటించారు.
నియమాలు తప్పక పాటించాల్సిందే
ఆరు నెలల శిక్షణను పూర్తి చేసుకున్న పూజారులు త్వరలో విధుల్లోకి చేరుతున్న సందర్భంగా అనిల్ మిశ్రా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. వారు పాటించాల్సిన విధి నిషేధాలను వెల్లడించారు. పూజారులు(Ayodhya Priests)గా కొత్తగా నియుక్తులైన వారు కమిటీ నిర్ణయించిన మార్గనిర్దేశకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
పూజారుల డ్రెస్ కోడ్ అదే
అయోధ్య రామాలయంలో పని చేసే పూజారులు నడుము నుంచి కింది భాగంలో ‘‘అచలం’’, పై భాగంలో ‘‘చౌబంది’’ ధరించాల్సి ఉంటుంది. చలికాలంలో కాషాయ రంగులో ఉన్ని దుస్తులు ధరించవచ్చు. పూజా సమయాల్లో మొబైల్ ఫోన్ (Mobile Phones), ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి వుండటం నిషిద్ధం. అయితే అవసరమైనప్పుడు బేసిక్ ఫోన్ వాడుకోవచ్చు అని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
అయోధ్యలో రద్దీ
మరోవైపు గతేడాది జనవరిలో అయోధ్యలో శ్రీరాముడి (Ayodhya Balak Ram) ప్రతిష్ఠాపన రంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి అయోధ్యకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అయోధ్యకు వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఓవైపు యూపీ సర్కార్.. మరోవైపు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది. మరోవైపు దేశనలుమూలల నుంచి అయోధ్యకు బస్సు, రైలు, విమాన సౌకర్యాలు కూడా పెరిగాయి.