రష్యా–ఉక్రెయిన్ యుద్ధం (Russia–Ukraine War) ఆగడంలేదు. రెండున్నరేళ్ల సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ పోరులో ఇరు దేశాలకు చెందిన సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఉక్రెయిన్ (Ukraine) కకావికలమైంది. వేలాది మంది చనిపోయారు. లక్షల కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. ఉక్రెయిన్ సైనికుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుండడంతో ఇక పోరు చేయలేమంటూ వారు చేతులెత్తేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ప్రముఖ మీడియా సంస్థ స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్ స్కీ (Volodymyr Zelensky) మాట్లాడుతూ దేశ రాజధాని కీవ్ ఆధీనంలో ఉన్న భూభాగాన్ని నాటో (NATO) పరిధిలోకి తీసుకొస్తే యుద్ధాన్ని ముగించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ‘యుద్ధంలోని కీలక దశను ఆపాలనుకుంటే మా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వాలి. అప్పుడే మేం కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం మా దేశాన్ని నాటోలో చేర్చాలి. అలా జరిగితే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని అధికారికంగా సాధించుకునే వీలు మాకు లభిస్తుంది’ అని అన్నారు.
సైనిక చర్య పేరుతో 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా (Russia) యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ రెండు దేశాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ పోరులో ఉక్రెయిన్‌కు కోలుకోలేని నష్టం ఏర్పడింది. ఆ దేశానికి భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది. కవ్కు తాము అందించిన క్షిపణులను రష్యాపై వాడుకోవచ్చని అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రష్యా.. ఉక్రెయిన్‌పై మిస్సైల్స్‌తో దాడులు తీవ్రం చేసింది.






