Mana Enadu : భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ మెడల్ విన్నర్.. పూసర్ల వెంకట సింధు (PV Sindhu) గురించి తెలియని వారుండరు. నిత్యం తన ఆటతో వార్తల్లో నిలిచే ఈ షట్లర్ తాజాగా తన పర్సనల్ లైఫ్ విషయంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే..? ఈ దిగ్గజ క్రీడాకారిణి త్వరలోనే వివాహ బంధంలో అడుగుపెట్టనుంది.
సింధును పెళ్లాడబోయే అబ్బాయెవరు?
ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్(World Badminton Rankings) లో నంబర్ 2 స్థానానికి చేరిన అరుదైన రికార్డు.. మరెన్నో టెర్నీల్లో దేశానికి పేరు తెచ్చీన పీవీ సింధును పెళ్లాడబోయేది ఎవరు? అతడు తెలుగబ్బాయేనా? ఏం చేస్తుంటారు? క్రీడారంగానికి సంబంధించిన వ్యక్తా? లేక అధికారుల కుటుంబం నుంచి వచ్చాడా? రాజకీయ వారసుడా? అని నెటిజన్లు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. మరి ఇంతకీ మన స్టార్ షట్లర్ ను పెళ్లాడబోయే ఆ వ్యక్తి ఎవరో ఓసారి తెలుసుకుందామా..?
స్పోర్ట్స్ ఫ్యామిలీలోకి వచ్చేదెవరు?
పీవీ సింధు ఫ్యామిలీ (PV Sindhu Family) సంగతికి వస్తే.. ఆమె తండ్రి పూసర్ల వెంకటరమణ జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్. తల్లి విజయ కూడా జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్. వీరి పెద్ద కుమార్తె దివ్య డాక్టర్. ఆమె జాతీయస్థాయి నెట్ బాల్ ప్లేయర్ కూడా. ఇక సింధు ఇండియన్ స్టార్ షట్లర్. అంటే సింధు ఫ్యామిలీ పూర్తిగా స్పోర్ట్స్ ఫ్యామిలీ అన్నమాట. మరి ఇలాంటి కుటుంబంలోకి వస్తున్న వ్యక్తి ఎవరు?
ఎవరీ వెంకటదత్త సాయి?
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయి(PV Sindhu Groom)తో సింధు పెళ్లి ఖాయం చేసినట్లు ఆమె తండ్రి పీవీ రమణ తెలిపారు. ఈ నెల 22న రాజస్థాన్ ఉదయ్‌పూర్ లో వీరి వివాహం.. 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనున్నట్లు వెల్లడించారు. తమ రెండు కుటుంబాలకు చాలాకాలంగా పరస్పరం పరిచయం ఉందని.. నవంబరులోనే పెళ్లికి సంబంధించి రెండు కుటుంబాలు నిర్ణయానికి వచ్చాయని చెప్పారు. ఇక సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు వివరించారు.
ఐపీఎల్ టీమ్ తో అనుబంధం
వెంకట దత్త సాయి ఓ ఏంజెల్ ఇన్వెస్టర్. ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి 2018లో బీబీఏ పూర్తి చేసిన ఆయన.. డేటా సైన్స్-మెషీన్ లెర్నింగ్ లో బెంగళూరు ట్రిపుల్ ఐటీ నుంచి మాస్టర్స్ కంప్లీట్ చేశారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. జేఎస్‌డబ్ల్యూలో (జిందాల్ సౌత్ వెస్ట్) వెంటక దత్త సాయి తన కెరీర్‌ను మొదలు.. సమ్మర్ ఇంటర్న్‌గా, ఇన్-హౌస్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. తన విధుల్లో భాగంగా జేఎస్‌డబ్ల్యూ యాజమాన్యంలోని దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుతోనూ కలిసి పనిచేసినట్లు తెలిసింది.






