Mana Enadu : ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ (Baba Siddique) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన కంటే ముందే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)ను హత్య చేయాలని షూటర్లు ప్లాన్ చేశారని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అది సాధ్యం కాకపోవడంతో బాబా సిద్దిఖీని హత్య చేసినట్లు.. ఈ కేసుకు సంబంధించి నిందితుల ఇంటరాగేషన్‌లో తెలిసినట్లు తెలిపాయి. తమ హిట్ లిస్ట్‌లో సల్మాన్ ఖాన్ టాప్‌లో ఉన్నట్లు షూటర్ ఒప్పుకున్నట్లు దర్యాప్తు బృందం తెలిపింది.
సెక్యూరిటీ వల్ల సల్మాన్ బతికిపోయాడు
“తొలుత సల్మాన్ ఖాన్ ను హత్య చేయాలని మాకు ఆదేశాలు వచ్చాయి. ఆయన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించాం. ఆయన వద్ద టైట్ సెక్యూరిటీ ఉండటంతో.. మేము బాబా సిద్దిఖీని టార్గెట్ చేసి అతణ్ని మట్టుబెట్టాం.” అని నిందితుడు విచారణలో చెప్పినట్లు దర్యాప్తు బృందం తెలిపింది. దీనికి సంబంధించిన వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలను కూడా అధికారులు సేకరించినట్లు వెల్లడించింది.
హిట్ లిస్టులో జీషాన్
ఇక అక్టోబర్ 12వ తేదీన ముంబయిలోని బాంద్రా వద్ద జీషాన్ సిద్దిఖీ (zeeshan siddique) కార్యాలయం సమీపంలో బాబా సిద్దిఖీని షూటర్లు కాల్చిచంపారు. ఆ సమయంలో జీషాన్ అక్కడ లేకపోవడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. తమ హిట్ లిస్ట్‌లో అతడు కూడా ఉన్నట్లు నిందితులు తెలిపారు.
సల్మాన్ కు వై ప్లాస్ కేటగిరీ సెక్యూరిటీ
మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi Gang) ఇప్పటికే సల్మాన్ ఖాన్‌ను హత్య చేస్తామని బెదిరించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆయనకు వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించారు. ప్రస్తుతం రెండు ఎస్కార్ట్ వాహనాలతో సహా దాదాపు 60 మంది సిబ్బంది ఆయన రక్షణ బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలోని జైల్లో ఉన్న అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bishnoi) పేరును అధికారులు మహారాష్ట్ర వ్యవస్థీకృత నేర నియంత్రణ చట్టం (మకోకా) కింద చేర్చారు. ఇతడే ముగ్గురు షూటర్లకు బ్రెయిన్ వాష్ చేసి బాబా సిద్దిఖీ హత్యకు ప్రేరేపించినట్లు సమాచారం.