Mana Enadu : సినీ నటుడు మోహన్‌బాబు (Mohan Babu) అరెస్టు విషయంపై రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆయన అరెస్టులో ఎలాంటి ఆలస్యం లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారమే అంతా జరుగుతోందని తెలిపారు. ఇప్పటివరకు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని.. ప్రస్తుతం విచారణ జరుగుతోందని వెల్లడించారు. చట్టపరంగా ఎలా ముందుకువెళ్లాలో అలాగే వెళ్తామని పేర్కొన్నారు.
కోర్టు ఆదేశాలను గౌరవిస్తాం
మోహన్‌బాబును విచారించే విషయంలో మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలని తెలిపిన సీపీ (Rachakonda CP).. ఇప్పటికే తాము నోటీసులు ఇచ్చామని.. అయితే ఆయన డిసెంబరు 24వ తేదీ వరకూ సమయం అడిగారని చెప్పారు. మోహన్‌బాబు వల్ల రంజిత్ గాయపడ్డారు కాబట్టి, సానుభూతితో పలకరించడానికి వెళ్లి ఉంటారని.. అయితే, చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాగే తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు కోర్టు కూడా ఆయనకు సమయం ఇవ్వడంతో.. కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని తెలిపారు.
మోహన్ బాబును అరెస్టు చేస్తాం
“అయితే కోర్టు ఇచ్చిన సమయంలోపే మరోసారి మోహన్‌బాబుకు నోటీసు ఇచ్చి, గడువు కన్నా ముందే విచారణ చేపట్టవచ్చా? అని న్యాయస్థానాన్ని అడుగుతాం. కోర్టు ఇచ్చే సూచనలను బట్టి ఈ కేసులో ముందుకెళ్తాం. మోహన్ బాబు దగ్గరున్న గన్స్ మా కమిషనరేట్ పరిధిలో లేవు. ఆయన గన్ ను చిత్తూరు జిల్లా చంద్రగిరిలో డిపాజిట్ చేశారు. మంచు విష్ణు, మనోజ్ లను పిలిచి బాండ్స్ రాయించుకున్నాం. 24వ తేదీ తర్వాత నోటీసులపై స్పందించకపోతే మోహన్ బాబును అరెస్టు తప్పదు’’ అని సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) తెలిపారు.
గన్ సరెండర్ చేసిన మోహన్‌బాబు
మరోవైపు మోహన్‌బాబు (Mohan Babu Surrenders Gun) తన లైసెన్స్‌డ్ గన్‌ను సరెండర్ చేశారు. తన పీఆర్వో ద్వారా డబుల్ బ్యారెల్ గన్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల వివాదాలు తలెత్తిన నేపథ్యంలో మోహన్ బాబు, ఆయన కుమారుడు, నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) పోలీసులను ఆశ్రయించారు. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వారి తుపాకుల్ని సరెండర్ చేయమని పోలీసులు ఆదేశించిన విషయం తెలిసిందే.







