Mana Enadu : తిరుమల (Tirumala Temple) శ్రీవారి భక్తులకు అలర్ట్. మార్చి 2025కు సంబంధించి తోమాల, సుప్రభాతం, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఈ టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. వీటిలోనే ఈ నెల 20వ తేదీన 10 గంటలకు లక్కీ డిప్ కోటా కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది.
మార్చి 2025 కోటా టికెట్లు
తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు నిత్యం ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే టీటీడీ ప్రతి నెలా ఆర్జిత సేవా టికెట్ల కోటాను (Tirumala Arjitha Seva Tickets) ఆన్ లైన్ లో విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మార్చి నెలకు సంబంధించిన టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భక్తులు ఈ విషయం గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
21న ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు
ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ (TTD Darshan Tickets) అధికారులు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం కోటా, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా విడుదల చేయనున్నట్లు చెప్పారు.
టీటీడీ వెబ్ సైట్లో టికెట్ బుకింగ్
అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. ఇక 24న ఉదయం 10 గంటలకు మార్చి 2025 ప్రత్యేక ప్రవేశ దర్శనం (TTD Special Darshan Tickets) రూ.300 టికెట్ల కోటా.. మధ్యాహ్నం సమయంలో తిరుపతి, తిరుమలలో అద్దె గదుల బుకింగ్ ఉంటుందని టీటీడీ వివరించింది. 27న మార్చి నెలకు సంబంధించి శ్రీవారి సేవ కోటా విడుదల చేయనున్నట్లు పేర్కొంది. భక్తులు ఈ టికెట్ల కోసం https://ttdevasthanams.ap.gov.inలో బుక్ చేసుకోవాలని సూచించింది..






