Mana Enadu : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పై ఏసీబీ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించనుంది. అసలు కేటీఆర్ పై కేసు ఏంటి..? అది కూడా ఏసీబీ కేసు.. అసలేం జరుగుతోంది అంటే..?
కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ-కారు రేసు ఉచ్చు
గతేడాది ఫిబ్రవరి లో హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ- రేసు (Formula E- Car Race Scam)ల్లో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దాదాపు రూ.55 కోట్ల ప్రభుత్వ సొమ్మును విదేశీ సంస్థలకు అప్పనంగా ఇచ్చేందుకు అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక అంగీకారం తెలిపారనే ఆరోపణలున్నాయి. ఈ అభియోగాలపై కేటీఆర్ (KTR ACB Case)ను ప్రాసిక్యూట్ చేయడానికి రెండు రోజుల క్రితం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఏసీబీకి అనుమతి మంజూరు చేసినట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు.
కేటీఆర్ పై కేసు నమోదుకు రంగం సిద్ధం
అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన మంత్రి వర్గం ఫార్ములా – ఈ కారు వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించింది. రేసు జరిగిన సమయంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ (Telangana Governor) అనుమతి ఇచ్చినట్లు సీఎస్ శాంతికుమారి కేబినెట్ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి హోదాలో అభియోగాలు ఉన్నందున, అవినీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి కోసం పురపాలక శాఖ లేఖ రాయగా.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న గవర్నర్ అనుమతులు ఇచ్చినట్లు సీఎస్ చెప్పారు.
కేటీఆర్ అరెస్టు తప్పదా..?
ఇక గవర్నర్ ఇచ్చిన అనుమతిని వెంటనే ఏసీబీకి పంపించేందుకు సీఎస్ (Telangana CS)కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేసు కేసులో చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుంది. అర్వింద్ కుమార్‌పై కేసు నమోదు కోసం సీఎస్ ఇప్పటికే అనుమతినిచ్చారు. కేటీఆర్‌పై మంత్రి హోదాలో అభియోగాలు ఉన్నందున చట్ట ప్రకారం గవర్నర్ అనుమతి కోరాం. ఇప్పుడు గవర్నర్ అనుమతి కూడా వచ్చేసింది. అయితే ఈ కేసులో కేటీఆర్ అరెస్టుపై ఇప్పుడే నేనేం చెప్పలేను. చట్టం తన పని తాను చేస్తుంది. అని మంత్రి పొంగులేటి (Minister Ponguleti) వ్యాఖ్యానించారు.






