
Mana Enadu : గత కొంతకాలంగా టాలీవుడ్ మంచు కుటుంబం గొడవలు (Manchu Family Fight) తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ కుటుంబంలో రోజుకో వివాదం వెలుగులోకి వస్తోంది. మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదంపై మొదటిసారిగా ఆయన భార్య, మంచు మనోజ్ తల్లి నిర్మల (Manchu Nirmala) స్పందించారు. ముఖ్యంగా శనివారం రోజున నెలకొన్ని జనరేటర్ లో పంచదార గొడవపై స్పందిస్తూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు లేఖ రాశారు. ఆ లేఖలో ఏం ఉందంటే..
ఆరోజు ఏం జరిగిందంటే..?
‘‘డిసెంబర్ 14వ తేదీన నా బర్త్ డే. ఆ రోజున విష్ణు (Manchu Vishnu) జల్‌పల్లిలోని మా ఇంటికి వచ్చాడు. కేకు తీసుకొచ్చి నా పుట్టిన రోజు సెలబ్రేట్ చేశాడు. ఈ విషయంలో మంచు మనోజ్.. విష్ణు మీద అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చాడని తెలిసింది. అందుకే నేను ఈ లేఖ రాస్తున్నా. అసలు ఆరోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కాసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడు.
ఈ ఇంటిపై మనోజ్ (Manchu Manoj)కు ఎంత హక్కు ఉందో నా పెద్ద కుమారుడు విష్ణుకీ అంతే హక్కు ఉంది. నా బర్త్ డే సెలబ్రేట్ చేయడానికి మాత్రమే విష్ణు మా ఇంటికి వచ్చాడు. ఆరోజు తానొక్కడే వచ్చాడు. తనతో ఎవరూ బాడీగార్డ్స్, ఇతర వ్యక్తులు రాలేదు. విష్ణుపై మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో నిజం లేదు. ఆ ఇంట్లో పనివాళ్లు కూడా ఇక్కడ పనిచేయలేమని మానేశారు. అందులో విష్ణు ప్రమేయం ఏం లేదు.’ అని లేఖలో నిర్మల పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..?
ఈనెల 14న తన తల్లి నిర్మల పుట్టినరోజు సందర్భంగా విష్ణు (Manchu Manoj Vs Vishnu) తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్లు మంచు మనోజ్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. బౌన్సర్లు, తన మనుషులతో వచ్చిన విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి, పవర్ సప్లై నిలిపివేశాడని అందులో పేర్కొన్నాడు. తాను సినిమా షూటింగులో.. తన భార్య కుమారుడి స్కూల్ ఈవెంట్ కు హాజరైన సందర్భంలో విష్ణు తన అనుచరులతో ఇంట్లోకి ప్రవేశించాడని తెలిపాడు. విష్ణు చేసిన చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని.. తాను, తన ఫ్యామిలీ భయంతో బతుకుతున్నామని వాపోయాడు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నాడు.