Mana Enadu : అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). ఈ క్రమంలో ఆయన మరోసారి భారత్ (India) ‘సుంకాల’ అంశాన్ని ప్రస్తావిస్తూ పాత పాటే పాడారు. అమెరికా ఉత్పత్తులపై న్యూదిల్లీ అత్యధిక టారిఫ్లు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ.. దీనికి ప్రతీకార పన్ను తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఫ్లోరిడాలోని తన ఎస్టేట్లో విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మీ యాక్షన్ కు మా రియాక్షన్
“అమెరికా అత్పత్తులపై బ్రెజిల్ (Brazil), భారత్ దేశాలు 100, 200 శాతం పన్నులు, అత్యధిక టారిఫ్ లు విధిస్తున్నాయి. దీనికి కచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. మీరు మాపై పన్నులు విధిస్తే.. మేమూ అంతేస్థాయిలో పన్నులు వసూల్ చేస్తాం. భారత్ మాపై 100 శాతం పన్ను విధిస్తే.. మేం వారిపై అలాగే ఛార్జ్ చేస్తాం. ఆయా దేశాలు పన్ను వసూలు చేయడం అనేది వారిష్టం. అలాగే మా స్పందన మా ఇష్టం”. అంటూ ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు.
గతంలోనూ ఇదే మాట
ఇక అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా ట్రంప్ (Donald Trump Taxes) పలుమార్లు సుంకాల అంశంపై ఇలాంటి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, చైనా, బ్రెజిల్ దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తానని గతంలోనూ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇక తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేయడంతో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఆసక్తిగా మారింది.
మీరు కంటిన్యూ చేయండి
ఇదిలా ఉండగా.. భారత్, అమెరికా సంబంధాల (India US Relations)పై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ టీమ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బైడెన్ పాలనలో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం.’ అని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాతో భేటీ సందర్భంగా అమెరికా విదేశాంగశాఖ డిప్యూటీ సెక్రటరీ కర్ట్ కాంప్బెల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.






