
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్అంబేద్కర్(Ambedkar)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడుతున్న విపక్షాలు గురువారం పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగాయి. పట్టణాలు, గ్రామాల్లోనూ ప్రతిపక్షాలు, కులసంఘాలు ఆందోళన చేపడుతున్నాయి.
ఈక్రమంలోనే తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) పార్టీ అధ్యక్షులు విజయ్ (Vijay) ఎక్స్ వేదికగా స్పందించారు. అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. కొంతమందికి అంబేడ్కర్ పేరు అంటేనే గిట్టదని విమర్శించారు. ‘కొంతమందికి అంబేడ్కర్ పేరు వినడమే నచ్చదు. ఆయన భారత్ పౌరులందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి. సామాజిక న్యాయానికి ప్రతీక. అంబేడ్కర్.. అంబేడ్కర్.. అంబేడ్కర్ అని ఆయన పేరు వింటేనే మనసు, పెదవులకు సంతోషంగా ఉంటుంది’ అని విజయ్ (Dalapathi Vijay) పేర్కొన్నారు.
పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత
అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలతో పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం పార్లమెంట్ (Parliament)లోకి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి. అయితే కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కారణంగానే తాను కిందపడినట్లు బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి (Pratap Chandra Sarangi) ఆరోపించారు.