ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google Layoffs) మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మరోసారి ఉద్యోగాల్లో కోత విధించింది. గతంలోనే భారీగా లేఆఫ్స్ ప్రకటించిన ఈ సంస్థ తాజాగా మేనేజ్మెంట్ రోల్స్‌లో ఉన్న వారిని ఇంటికి పంపించేసింది. మేనేజర్, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో పనిచేస్తున్న వారిలో 10 శాతం మందిని తొలగించింది. ఈ విషయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆల్ హ్యాండ్ మీటింగ్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు బిజినెస్ ఇన్సైడర్ తెలిపింది.
ఓపెన్ఏఐ వంటి ఏఐ సంస్థల (Open AI) నుంచి పోటీ పెరుగుతున్న వేళ తన సామర్థ్యాలను మెరుగు పరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పిచాయ్ తెలిపినట్లు పేర్కొంది. తాజా నిర్ణయంలో భాగంగా కొందరి హోదాలను తగ్గించి వారిని వ్యక్తిగత పాత్రలకే పరిమితం చేయనున్నట్లు తెలిపింది. మరికొన్ని ఉద్యోగాలను పూర్తిగా తొలగించనున్నట్లు వెల్లడించింది.
గడిచిన రెండేళ్లుగా గూగుల్ (Google Layoffs Updates) తన కంపెనీలో రీ ఆర్గనైజింగ్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తమ సంస్థ 20 శాతం మరింత సమర్థంగా పని చేయాలని 2022లో సుందర్ పిచాయ్ చెప్పారు. ఈ క్రమంలోనే 2023లో ఏకంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇక తాజాగా మరోసారి 10 శాతం లేఆఫ్స్ ప్రకటించింది.






