Mana Enadu : ఏపీ ఫైబర్‌నెట్ (AP Fibernet)ను ప్రక్షాళన చేస్తున్నామని ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం అర్హత లేని వారిని ఫైబర్ నెట్‌లో నియమించిందని ఆయన అన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సర్కార్ నియమించిన 410 మందిని తొలగిస్తామని తెలిపారు. వైసీపీ నేతల ఆదేశాలతో అర్హత లేని వారిని నియమించారని ఆరోపించారు. విజయవాడలో మంగళవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు సిబ్బంది వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రులు (YSRCP Ministers), ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పని చేశారని తెలిపారు.
వేతనాల పేరుతో ఫైబర్ నెట్ నుంచి రూ. కోట్లు దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. వైస్సార్సీపీ ప్రభుత్వం వైఖరితో ఫైబర్ నెట్ దివాలా అంచుకు చేరిందని మండిపడ్డారు. అయితే తాము కక్షతో, దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం (AP Fibernet Layoffs) లేదని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని తెలిపారు. ఫైబర్ నెట్‌లో అవసరాల మేరకు ఉద్యోగులను తీసుకుంటామని వెల్లడించారు.
మరోవైపు ఆర్జీవీ, వ్యూహం (RGV Vyooham) చిత్రబృందం వివాదం గురించి కూడా ఆయన మాట్లాడారూ. జగన్ సర్కార్ హయాంలో ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి అక్రమంగా డబ్బు చెల్లించారని.. డబ్బు తిరిగి చెల్లించేందుకు ఆయనకు 15 రోజుల సమయం ఇచ్చామని చెప్పారు. గడువులోగా డబ్బు చెల్లించకుంటే ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని జీవీ రెడ్డి తెలిపారు.






