Mana Enadu : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మెదక్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మొదట ఆయన ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. అనంతరం అక్కడి నుంచి మెదక్ క్యాథెడ్రల్ చర్చికి చేరుకోగా.. పాస్టర్లు ఆయనకు మెదక్ చర్చి నమూనాను జ్ఞాపికగా అందజేశారు. అనంతరం సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మేర్రీ క్రిస్మస్
క్రిస్మస్ సందర్భంగా చర్చిని సందర్శించిన వారందరికి క్రిస్మస్ (Merry Christmas) శుభాకాంక్షలు తెలిపారు. చర్చిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెదక్ చర్చి వందేళ్ల వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. క్రైస్తవ సోదరులకు పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. కులమతాలకు అతీతంగా తమ ప్రభుత్వం అందరికి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
మా ప్రభుత్వాన్ని దీవించండి
“మా ప్రజా ప్రభుత్వాన్ని అందరూ దీవించండి. పేదల ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. త్వరలో ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎక్కువగా దళిత, గిరిజన క్రైస్తవులకు లబ్ది చేకూరుతుంది. మా సర్కార్ రైతులకు పంట బోనస్ కూడా ఇస్తోంది. రూ.21 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేశాం. రైతు భరోసా(Rythu Bharosa)తో త్వరలో అన్నదాతలకు మరింత అండగా నిలవనున్నాం.” అని రేవంత్ రెడ్డి తెలిపారు.
మళ్లీ సీఎం హోదాలోనే వస్తా
ఈ సందర్భంగా అన్ని వర్గాలకు మేలు చేస్తున్న తమ ప్రభుత్వం పది కాలాల పాటు వర్ధిల్లాలని అందరూ ప్రార్థించాలని సీఎం రేవంత్ కోరారు. వచ్చే ఏడాది కూడా క్రిస్మస్ వేడుకల (Medak Church)కు సీఎం హోదాలోనే వస్తానని పేర్కొన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో తమ సర్కార్ చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. ఏ అవసరం ఉన్న మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అందరికి మరోసారి హ్యాపీ క్రిస్మస్ అని సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు.







