Mana Enadu : భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల సంస్కర్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) (92) కన్నుమూశారు. గురువారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయణ్ను ఆస్పత్రికి తరలించగా.. కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ రాత్రి 9.51 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. మన్మోహన్ మరణం పట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ నివాళి
దిల్లీలోని ఆయన నివాసంలో మన్మోహన్ సింగ్ పార్థీవదేహాన్ని ఉంచారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులు సందర్శించి ఆయనకు అంజలి ఘటిస్తున్నారు. మన్మోహన్ కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మన్మోహన్సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మోదీతో పాటు అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డా కూడా మన్మోహన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
#WATCH | Delhi | PM Narendra Modi pays last respects to late former PM Dr Manmohan Singh and offers condolences to his family pic.twitter.com/7vn1PB1Xdj
— ANI (@ANI) December 27, 2024
రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
ఇక శనివారం రోజున మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి (AICC Head Office) తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని అక్కడ కాసేపు ఉంచనున్నారు. అనంతరం దిల్లీ రాజ్‌ఘాట్ సమీపంలో కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు (Manmohan Singh Funeral) నిర్వహించనున్నారు. మన్మోహన్సింగ్ మృతితో కేంద్రం 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం అందించింది. జనవరి 1 వరకు జాతీయజెండాను అవనతం చేయాలని సూచించింది.






