Mana Enadu : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh) గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు దేశవ్యాప్తంగా ప్రముఖులతో పాటు ప్రపంచ దేశాల నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. మరోవైపు ఆయన గురించి ప్రజలెవరికీ తెలియని విషయాలను పలు మీడియా సంస్థలు తమ కథనాల ద్వారా వెలుగులోకి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయంపై ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది. అదేంటంటే..?
ఒకరు 117 మరొకరు జీరో
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను ప్రస్తుత పీఎం నరేంద్ర మోదీ (PM Modi) ఒక్క విషయంలో ఎప్పటికీ బీట్ చేయలేరంటూ ఇప్పుడు ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. మోదీకి అది అసాధ్యమైన విషయమేనని రాజకీయ నిపుణులు కూడా భావిస్తున్నారు. అదే.. మీడియా సమావేశం నిర్వహించడం. గత పదిన్నర సంవత్సరాల్లో ప్రధాని మోదీ ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. కానీ మన్మోహన్ సింగ్ తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పదేళ్లలో ఏకంగా 117 సార్లు ప్రెస్ మీట్ (Manmohan Singh Press Meets) నిర్వహించారు. ఇక తన చివరి మీడియా మీట్ లో ఆయన ప్రసంగం ఇప్పటికీ అందరికీ గుర్తే.
నోరు తెరిచిన ప్రతిసారి
2004లో అనూహ్యంగా ప్రధానమంత్రి పదవి చేపట్టారు మన్మోహన్ సింగ్. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల కాలం పాటు ఆ పదవిలో బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. ఏ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టలేదు. చాలా మంది నేతల్లాగా ఆయనకు వాగ్ధాటి లేదు. కానీ ఆయన నోరు తెరిచిన ప్రతిసారి దేశానికి మంచే జరిగింది.
ఓటమి తెలియని మోదీ
ఇక నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. 2024లో మూడోసారి భారత్ పీఎంగా ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ ఓడలేదు. సీఎంగా 12 ఏళ్లు.. పదేళ్లు పీఎంగా చేశారు. ఇక ప్రజలను ఆకర్షించేలా ప్రసంగించడంలో ఆయన దిట్ట. భారత్ లోనే కాదు.. వరల్డ్ లోనూ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది.
మన్మోహన్ ను బీట్ చేయలేని మోదీ
ఇలా మన్మోహన్ సింగ్ కు.. నరేంద్ర మోదీకి చాలా తేడా ఉంది. కానీ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడంలో మన్మోహన్ ను మోదీ (Modi Press Meet) ఎప్పటికీ బీట్ చేయలేరు. సోనియాగాంధీ చాటు పీఎంగా విమర్శలు ఎదుర్కొన్నా.. ఆయన హయాంలో భారీ కుంభకోణాలు జరిగినా.. మన్మోహన్ ఎప్పుడూ ప్రజల ముందుకు వచ్చేందుకు వెనకడుగు వేయలేదు. ఆయన పదేళ్ల కాలంలో ఏకంగా 117 సార్లు.. అంటే ఏడాదికి 17 సార్లు ప్రెస్ మీట్లు నిర్వహించారు. నెలకు ఒక్కసారైనా ఆయన మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
మీడియా ఎదుట మౌన ముని మోదీ
ఇక తన మాటలతో.. ప్రసంగాలతో ఎంతోమందిని ఆకర్షించే ప్రస్తుత ప్రధానమంత్రి మాత్రం ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. 2019లో మీడియా సమావేశంలో మోదీ పాల్గొన్నా.. అప్పుడు అమిత్ షా (Amit Shah) మాత్రమే మాట్లాడారు. మౌన మునిగా పేరున్న మన్మోహన్ మీడియా వారి ప్రశ్నలకు తొణకకుండా సమాధానాలిస్తూ నిజాయితీగా ఉంటే.. వాక్పఠిమ కలిగిన నరేంద్ర మోదీ మాత్రం మీడియా ఎదుట ఎప్పుడూ మౌన మునిగానే ఉన్నారు. ఇక మన్మోహన్ 117 మీడియా సమావేశాల్లో 72 మంది విదేశీ పర్యటనలు, 10 మంది వార్షిక ప్రెస్ లు, 23 మంది దేశీయ లేదా రాష్ట్ర పర్యటనలు, 12 ఎన్నికలకు సంబంధించినవి ఉన్నాయి.






