Mana Enadu : : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) భౌతికకాయం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ప్రజల సందర్శనార్ధం ఆయన పార్థివదేహాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ఆర్మీ వాహనంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి భౌతికకాయాన్ని తీసుకు వచ్చారు. కార్యాలయం వెలుపల ఆర్మీ వాహనం ఆపి, ఆయన మృతదేహాన్ని భుజాలపై మోసుకొని లోపలికి తీసుకెళ్లారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
మన్మోహన్కు తుది వీడ్కోలు పలికేందుకు భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ(AICC)కి తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీడబ్ల్యూసీ నేతలు, ఇతర నాయకులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఉదయం 11.45 గంటలకు దిల్లీ నిగంబోథ్ ఘాట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
అంత్యక్రియలపై ఉత్కంఠ
మరోవైపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు (Manmohan Singh Funeral) ఎక్కడ నిర్వహించనున్నారనే ప్రకటన వెలువడటంపై శుక్రవారం చాలాసేపు ఉత్కంఠ కొనసాగింది. స్మారక నిర్మాణం చేపట్టేందుకు వీలున్న స్థలంలోనే ఆయనకు అంతిమ సంస్కారాలు పూర్తిచేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని కోరారు. అయితే నిగమ్బోధ్ ఘాట్లో మన్మోహన్ అంత్యక్రియలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
స్మారకం నిర్మాణం ఎక్కడ?
ఇక మన్మోహన్ గౌరవార్థం స్మారకం (Manmohan Singh Memorial) నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే అందుకు సరైన వేదికను గుర్తించేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్మారకం నిర్మించాలన్న తమ నిర్ణయాన్ని కాంగ్రెస్కు ప్రభుత్వం చేరవేసిందని వెల్లడించాయి. కానీ ఈ విషయంలో ఆ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.






