Mana Enadu : సంక్రాంతి పండుగ సందర్బంగా తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) ప్రయాణికులకు తీపి కబురు అందించింది. సొంతూళ్లకు వెళ్లేవారి కోసం 6,432 ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు తెలిపింది. జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది. గతేడాది సంక్రాంతికి (Sankranti) 5,240 ప్రత్యేక బస్సులను (Special Buses) నడపగా.. రద్దీ దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది అదనంగా మరో వెయ్యి బస్సులను నడపాలని నిర్ణయించినట్లు పేర్కొంది. 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వివరించింది.
జనవరి 7 నుంచి ప్రత్యేక బస్సులు
రాష్ట్రంలో ప్రస్తుతం మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే మహిళలతో పాటు ఇతర ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
నో అదనపు ఛార్జీలు
ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సుదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రధాన ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లయిన ఉప్పల్, ఎల్బీనగర్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి ఉచిత ప్రయాణం సౌకర్యం ఉంటుందని వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్బంగా నడిపించే ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి అదనపు ఛార్జీలను (Extra Fair) వసూలు చేయడం లేదని వివరించారు.







