Mana Enadu : అరెస్టు నేపథ్యంలో మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. జర్నలిస్టు పై దాడి కేసులో మోహన్ బాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు (Telangana High Court) నిరాకరించింది. ఈ క్రమంలో మోహన్ బాబును పోలీసులు విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వగా.. ఆయన కొంత సమయం అడిగారు. తాజాగా ఆయనకిచ్చిన గడువు ముగియడంతో విచారణకు పిలిచేందుకు ఆయన కోసం పోలీసులు గాలించగా ఆయన ఎక్కడున్నారో తెలియడం లేదట.
అమెరికాకు మోహన్ బాబు
గత కొద్దిరోజులుగా మోహన్ బాబు (Mohan Babu Case) అజ్ఞాతంలో ఉన్నారని సమాచారం. ఆయన చంద్రగిరిలో ఉన్నారని సమాచారం రాగా పోలీసులు అక్కడికి వెళ్లి ఆరా తీశారు. అయితే ఆయన డిసెంబర్ 23వ తేదీ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారని తెలిసినట్లు సమాచారం. ప్రస్తుతం మోహన్ బాబు అమెరికాలో తలదాచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 16వ తేది హైదరాబాద్ నుంచి చంద్రగిరికి వెళ్లిన ఆయన అరెస్ట్ భయంతో ఎవ్వరికి చెప్పకుండా అమెరికా వెళ్లిపోయినట్లు వార్తలొస్తున్నాయి.
గన్ సరెండర్ చేసిన మోహన్ బాబు
మంచు మోహన్ బాబు, మనోజ్ (Manchu Manoj News) కు మధ్య మొదలైన వివాదం మీడియాపై దాడితో మలుపు తిరిగింది. జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మనోజ్, విష్ణు బౌన్సర్లతో జల్ పల్లిలో హంగామా సృష్టించడంతో రంగంలోకి దిగిన పోలీసులు మంచు ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు మోహన్ బాబును తన లైసెన్స్ డ్ తుపాకీని సరెండర్ చేయాలని ఆదేశించగా ఆయన తన గన్ ను పోలీసుల వద్ద సరెండర్ చేశారు.







