చేతికి గాయమై కమిలిపోయినా పట్టువిడవకుండా బ్యాటింగ్ చేసిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై (Rishabh Pant) ప్రశంసలు కురుస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan).. పంత్‌ను కొనియాడాడు. ప్రాణం పెట్టి మరీ సిడ్నీ టెస్టులో జట్టును పటిష్ట స్థితిలో నిలిపేందుకు కృషి చేశాడని మెచ్చుకున్నాడు. పదునైన బంతులు శరీరాన్ని గాయపరుస్తున్నా పట్టుదలగా నిలబడ్డ తీరు ప్రశంసనీయమన్నాడు.
కుప్పకూలిన లైనప్
BGT సిరీస్‌లో ఇప్పటికే 1-2 తేడాతో వెనుకబడిపోయిన టీమిండియా.. చివరిదైన ఐదో టెస్టు కోసం ప్రఖ్యాత సిడ్నీ గ్రౌండ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) సారథ్యంలో బరిలోకి దిగింది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయగా.. ఆసీస్ బౌలర్ల ధాటికి వెనువెంటనే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4) పూర్తిగా విఫలం కాగా.. శుబ్‌మన్ గిల్(20), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (17) భారీ స్కోరు సాధించలేకపోయారు.
కమిలిపోయి వాపు వచ్చినా..
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ రిషభ్ పంత్.. (Rishabh Pant) రవీంద్ర జడేజాతో జతకట్టి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే 35 ఓవర్‌వ ఓవర్లో పేసర్ మిచెల్ స్టార్క్(Starc) విసిరిన బంతి పంత్ మోచేతిపైన తాకడంతో వాపు వచ్చి నల్లబారిపోయింది. నొప్పితో పంత్ విలవిల్లాడాడు. గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా పెవిలియన్ చేరతాడని అంతా భావించినా.. చికిత్స తర్వాత తిరిగి ఆట కొనసాగించాడు.
మొత్తం 98 బంతులు ఎదుర్కొన్న పంత్ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 40 పరుగులు బోలాండ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
పంత్ వెనక్కి తగ్గలేదు
రిషభ్ పంత్ ప్రదర్శించిన పట్టుదల, ధైర్యాన్ని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు. ‘భారత బ్యాటర్లలో ఒక్కరూ కనీసం 30 పరుగుల మార్కును చేరుకోలేదు. పంత్ ఒక్కడు 40 రన్స్‌తో టాప్ స్కోరర్. పదే పదే బంతులు అతడి శరీరానికి తగిలాయి.
అయినా.. సరే పంత్ వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటికే అతడిపై మానసికంగా ఒత్తిడి ఉంది. ఈ రోజు మ్యాచ్‌లో శరీరం కూడా గాయపడింది. అయినా అద్బుతంగా పోరాడాడు. అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.








