చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వర్చువల్ గా ప్రారభించారు. అనంతరం ఈ టెర్మినల్ ను జాతికి అంకితం చేశారు. కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి నేరుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి (సోమవారం) నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్ హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సౌకర్యాలతో విమానాశ్రయం తరహాలో రూ.413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించిన విషయం తెలిసిందే.
ఎయిర్ పోర్టును తలదన్నేలా
ఎయిర్ పోర్టును తలదన్నేలా ఈ టెర్మినల్ ను నిర్మించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapalli Railway Terminal) నుంచి ప్రస్తుతం 13 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుంచి మరో 12 జతల రైళ్లు నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ టెర్మినల్‌లో 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్ట్‌లు, 7 బుకింగ్ కౌంటర్లతో పాటు పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు, హైక్లాస్ వెయిటింగ్ హాల్, గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో కెఫీటేరియా, రెస్టారెంట్, రెస్ట్రూమ్ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు.
ఆ స్టేషన్లపై తగ్గనున్న భారం
ఈ టెర్మినల్‌లో ఇప్పటికే రెండు పుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉండగా.. తాజాగా వాటికి అదనంగా మరో రెండు నూతన ఎఫ్‌ఓబీలు 12 మీటర్లతో ఒకటి.. 6 మీటర్లతో మరొకదాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో చర్లపల్లిలో 5 వరకు ప్లాట్ ఫారమ్ లు ఉండగా తాజాగా వాటి సంఖ్య 9కి పెంచారు. వీటిలో రెండు ప్లాట్ ఫారమ్‌లను డెడికేటెడ్‌గా ఎంఎంటీఎస్‌లకు కేటాయించారు. ఇక నేటి నుంచి ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో నాంపల్లి (హైదరాబాద్) రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ (Secunderabad Railway Station), కాచిగూడ రైల్వేస్టేషన్లపై ప్రయాణికుల భారం తగ్గుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తుంది.







