తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవాలని ఎంతో ఆశగా వెళ్లిన వారు స్వామిని దర్శించుకోకుండానే వైకుంఠానికి పయనమయ్యారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు తీసుకునేలోపే మృత్యు ఒడిలోకి ఒదిగిపోయారు. తిరుపతిలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాట (Tirupati Stampede)లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను రుయా, స్విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
వైకుంఠ ఏకాదశిని (vaikuntha ekadashi) పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ నెల 10, 11, 12వ తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు గురువారం ఉదయం 5 గంటలకు జారీ చేస్తామని టీటీడీ (TTD) ప్రకటించడంతో బుధవారం ఉదయం నుంచే కేంద్రాల వద్ద భక్తులు బారులు తీరారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సత్యనారాయణపురం జెడ్పీ హైస్కూల్, విష్ణునివాసం, శ్రీనివాసం, ఇందిరా మైదానం, రామచంద్రపుష్కరణి, ఎమ్మార్ పల్లి ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
క్యూలైన్లలోకి వెళ్లేందుకు
బుధవారం సాయంత్రానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో.. మొత్తం నాలుగు ప్రాంతాల్లో (జీవకోన, బైరాగిపట్టెడ, శ్రీనివాసం, అలిపిరి) తొక్కిసలాట చోటుచేసుకుంది. తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాట జరిగింది. బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లలోకి ప్రవేశించబోవడంతో.. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా తోసుకుంటూ లోపలికి వెళ్లే క్రమంలో తోపులాట జరగడంతో ఎస్పీ సుబ్బారాయుడు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
గేట్లు తెరవడంతో తొక్కిసలాట
బైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద భారీగా తరలి వచ్చిన భక్తులను సమీపంలో ఉన్న పద్మావతి పార్క్‌లోకి తరలించిన తర్వాత.. రాత్రి 8 గంటల 15 నిమిషాలకు పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోవడంతో క్యూలైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరిచారని భావించి భక్తులు ఒక్కసారిగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే క్షత్రగాత్రులను రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారని.. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని అధికారులు తెలిపారు.







