తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో బుధవారం రోజున జరిగిన తోపులాట (Tirupati Stampede) తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 40కి పైగా మంది అస్వస్థతకు గురి కాగా వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన నివేదిక సీఎం చంద్రబాబు వద్దకు చేరింది.
తొక్కిసలాట వల్ల చనిపోలేదు
అయితే తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Chintha Mohan) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో తొక్కిసలాట వల్ల భక్తులు చనిపోలేదని ఆయన అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి తిండి లేకుండా క్యూలో నిలబడి ఉన్నారని తెలిపారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో ఆత్రుతగా పరిగెత్తారని చెప్పారు.
టీటీటీ వైఫల్యం లేదు
శరీరంలో షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం వల్ల వాళ్లంతట వాళ్లే కిందపడి పోయారని చెప్పారు. ఈ క్రమంలోనే చనిపోయి ఉంటారని.. తోపులాట వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఎవరి నిర్లక్ష్యం లేదని.. ఇందులో టీటీటీ వైఫల్యం లేనే లేదని తెలిపారు. దేవస్థానం అధికారుల పనితీరు కూడా బాగుందని. టీటీడీ అధికారులను అభినందిస్తున్నానని చింతా మోహన్ అన్నారు.








