ప్రతి ఏడాదిలో 24 ఏకాదశిలు ఉంటాయి. వీటిలో దేనికదే ప్రత్యేకం. కానీ ఇందులో ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadasi) మాత్రం పరమపవిత్రం. ఈరోజు ఉపవాసం ఉండి, మహావిష్ణువును స్మరించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజునే.. రాత్రి సమయం అయిన దక్షిణాయనం పూర్తిచేసుకుని దేవతలకు పగటి సమయం అయిన ఉత్తరాయణం (Uttarayana 2025 ) ప్రారంభమవుతుంది.
ఉత్తర ద్వార దర్శనంతో సకల శుభాలు
అందుకే ఈరోజు నిద్రనుంచి మేల్కొనే శ్రీమన్నారాయణుడిని ఉత్తర ద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈరోజుకు అంత ప్రాధాన్యం. ఇక చాలా మంది ఏకాదశి రోజున ఉపవాసం ఉంటుంటారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి (vaikuntha ekadashi) అదేనండి ముక్కోటి ఏకాదశి రోజున తప్పక ఉపవాసం చేస్తారు. అలా చేయాలని పండితులు కూడా చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున అన్నం తినకూడనది అంటున్నారు. ఎందుకో తెలియజేస్తూ దీని వెనక ఉన్న కథను చెబుతున్నారు. అదేంటంటే..?
అందుకే ఉపవాసం చేయాలి
శ్రీ మహావిష్ణువు.. ముక్కోటి ఏకాదశి రోజునే మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఆ మురాసరుడు నివశించే ప్రదేశం అన్నం. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజు అన్నం తినకుండా ఉపవాసం చేయాలని పండితులు చెబుతున్నారు. వ్యాసమహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం.. ధనుర్మాసంలో సూర్యుడు తన దిశను మార్చుకునే ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 10వ తేదీన (శుక్రవారం) ముక్కోటి ఏకాదశి (vaikuntha ekadashi Story) వచ్చింది.
బ్రహ్మ ముహూర్తంలో దర్శనం
ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల సకల కష్టాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈరోజు తెల్లవారుజామున ( Brahma Muhurta time) మూడు గంటల నుంచి వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఇవాళ యథాశక్తి విష్ణువును పూజించి, విష్ణు సహస్రనామం పారాయణం చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఆలయాల్లో స్వామివారికి తులసిమాలలు సమర్పించాలని సూచిస్తున్నారు.
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
ఇక వైకుంఠ ఏకాదశిరోజు చేసే ఉపవాసం 24 ఏకాదశిలకు చేసే ఉపవాసం (vaikuntha ekadashi Fasting)తో సమానమని శాస్త్రం చెబుతోంది. రోజంతా భగవంతుడి ధ్యానంలో గడిపి.. సంధ్యాసమయంలో పూజ పూర్తి చేసి రాత్రంతా జాగరణ చేయాలని పండితులు చెబుతున్నారు. జాగరణ చేసేటప్పుడు విష్ణు నామ స్మరణ చేస్తే సంపూర్ణ ఫలితం దక్కుతుందని అంటున్నారు. ఆ తర్వాత ద్వాదశి రోజు ఉదయం యధాశక్తి పూజ చేసి, దానం చేసి ఉపవాసాన్ని విరమించాలని సూచిస్తున్నారు. ఇక వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం విన్నా.. పఠించినా పుణ్యఫలం దక్కుతుందని చెబుతున్నారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.






