తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన(Tirupati Stampede)లో ఆరుగురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తిరుపతి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇద్దరు సస్పెండ్.. ముగ్గురు బదిలీ
మరోవైపు ఈ ఘటనలో పలువురు అధికారులపై సీఎం చంద్రబాబు వేటు వేశారు. డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారు. ఇక మరో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేశారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, టీటీడీ సీఎస్‌వో శ్రీధర్‌ను బదిలీ చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. వాస్తవాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని సీఎం తెలిపారు. కొందరు అధికారులు నిర్లక్ష్యంగా పని చేశారని.. డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. డీఎస్పీ ఆలోచన లేకుండా పని చేశారని పేర్కొన్నారు.
దైవసన్నిధిలో రాజకీయాలొద్దు
“తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటాను. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించాను. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాను. అధికారులతో సమీక్ష నిర్వహించాను. ఈ దివ్యక్షేత్రం పవిత్రత కాపాడేందుకు ప్రయత్నిస్తాను. ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా.. కొన్ని సూచనలు చేశాను. నా సూచనలను బోర్డులో చర్చించి అమలు చేస్తారు. మన అసమర్థత వల్ల దేవుడికి చెడ్డ పేరు వస్తే మంచిది కాదు. తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు వీలులేదు.” అని చంద్రబాబు అన్నారు.
వైకుంఠ ద్వార దర్శనం పదిరోజులు ఎందుకు
తిరుపతిలో దేవుడికి సేవ చేస్తున్నామనే భావనతోనే పని చేయాలని చంద్రబాబు సూచించారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారిని దర్శించాలని భక్తులంతా కోరుకుంటారని.. తిరుపతిలో టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయం అని పేర్కొన్నారు. తిరుమలలో క్యూలైన్లలో ఉంటే భక్తులు దైవ చింతనలోనే ఉంటారని తెలిపారు. వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు పెంచారు, ఎందుకు పెంచారో తెలియదని వ్యాఖ్యానించారు. మొదటి నుంచి ఉన్న సంప్రదాయాలు మార్చడం మంచిది కాదని అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలని అన్నారు. ఏ ఆలయంలోనూ అపచారం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.








