తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు (Sankranti) ప్రారంభమయ్యాయి. భోగి పండుగ సందర్భంగా ఇవాళ తెలుగు లోగిళ్లు రంగవళ్లులతో కళకళలాడుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ, సినీ, ఇతర ప్రముఖులు కూడా సంక్రాంతి పండుగను తమ కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తన కుటుంబంతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh), భువనేశ్వరి నారావారిపల్లెకు వెళ్లారు.
నారావారిపల్లెకు చంద్రబాబు
తిరుపతిలో జరిగిన కార్యక్రమాలను ముగించుకుని సంక్రాంతి పండగను కుటుంబంతో కలిసి స్వగ్రామంలో జరుపుకొనేందుకు ఆదివారం రాత్రి సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు వెళ్లారు.
ఈ సందర్భంగా తిరుచానూరులో పైప్‌లైన్ గ్యాస్‌ను వినియోగిస్తున్న శరవణ ఇంటికి చేరుకొని స్వయంగా టీ తయారు చేసి కుటుంబంతోపాటు తాగారు. వారి సాదకబాధకాలు తెలుసుకున్న అనంతరం సాయం ప్రకటించారు. ఇక ఇవాళ ఉదయం తన కుటుంబంతో కలిసి చంద్రబాబు భోగి (Bhogi) వేడుకల్లో పాల్గొన్నారు.
భోగి శుభాకాంక్షలు
“రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ఆశలు, ఆశయాలూ తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ అందరికి మరొక్క మారు భోగి పండుగ శుభాకాంక్షలు.” అంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు.








