ప్రభుత్వ భూముల పరిరక్షణ (Govt Lands), చెరువులు, నాలాల కబ్జాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ హైడ్రా (HYDRA)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ నిర్మాణాలు ఎవరివైనా సరే నేలమట్టం చేస్తోంది. 2024 చివరి రోజు డిసెంబరు 31వ తేదీన కూడా హైడ్రా కూల్చివేతలు(Hydra Demolitions) చేపట్టింది. అయితే సీఎం రేవంత్ పాలన, హైడ్రా తీసుకున్న చర్యలపై తీవ్ర విమర్శలు రావడంతో కొంతకాలంగా మౌనంగా ఉన్న హైడ్రా బుల్డోజర్లు మళ్లీ రంగంలోకి దిగాయి. తాజాగా అమీన్‌పూర్(Ameernpur)లో హైడ్రా అధికారులు కూల్చివేతలకు సిద్ధమయ్యారు.
రంగంలోకి హైడ్రా బుల్డోజర్లు
హైదరాబాదులోని అమీన్ పూర్(Ameernpur)లో మరోసారి హైడ్రా అధికారుల కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. ఈ కూల్చివేతలు అమీన్ పూర్ పెద్ద చెరువు వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై జరుగుతున్నాయి. పలు ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు, చెరువును ఆక్రమించుకొని నిర్మాణాలు చేయడాన్ని గుర్తించారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలిన వెంటనే, హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కూల్చివేతలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ కూల్చివేతల సమయంలో ప్రజలు సహకరించాలని హైడ్రా అధికారులు కోరుతున్నారు.
జలశక్తిని రక్షించడమే లక్ష్యంగా..
ఈ కూల్చివేతలు ప్రభుత్వ ఆదేశాల మేరకు చెరువు భూస్వామ్యాలను తిరిగి ప్రభుత్వానికి కలపడం. జలశక్తిని రక్షించడం లక్ష్యంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నుంచి హైడ్రా దూసుకెళ్తోంది. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై గట్టిగానే చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే అమీన్‌పూర్‌లో మరోసారి హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.






