కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవి 1వ తేదీన పూర్తిస్థాయి బడ్జెట్ (Union Budget 2025) ప్రవేశ పెట్టనుంది. ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఓ మధ్యంతర బడ్జెట్తో కలిపి మొత్తంగా 7 సార్లు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి మరో రికార్డు క్రియేట్ చేయనున్నారు. ఈ క్రమంలోనే బడ్జెట్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
2025 పద్దుతో టాప్-3లో నిర్మలమ్మ
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947, నవంబర్ 26న షణ్ముగం షెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ (10 సార్లు) పేరిట ఉంది. ఆ తర్వాత పి. చిదంబరం (9 సార్లు), ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) (8 సార్లు) టాప్-3 లో ఉన్నారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్.. ఎనిమిదోసారి పద్దు ప్రవేశపెట్టి ప్రణబ్ సరసన నిలవనున్నారు.
రికార్డు బ్రేక్ చేసిన నిర్మలమ్మ
మరోవైపు వరుసగా ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన వారి జాబితాలో నిర్మలా సీతారామన్ రికార్డు క్రియేట్ చేశారు. నిర్మలమ్మ 2019 నుంచి వరుసగా ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ పద్దుతో ఆమె మొరార్జీ దేశాయ్ (Morarji Desai) రికార్డును బ్రేక్ చేశారు. మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
నిర్మలమ్మ బడ్జెట్ రికార్డులు
బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) పేరుగాంచితే.. ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట రికార్డు ఉంది. ఇక సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ రికార్డు క్రియేట్ చేశారు. 2020 ఫిబ్రవరి 1న బడ్జెట్ సమయంలో ఆమె ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు ప్రసంగించి చరిత్ర సృష్టించారు.






