కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) పూర్తిస్థాయి తొలి బడ్జెట్‌ను శనివారం రోజున ప్రవేశపెట్టారు. ఈ పద్దులో బిహార్(Bihar)పై వరాల జల్లు కురిపించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న ఆ రాష్ట్రానికి వార్షిక పద్దులో కాస్త స్పెషల్ స్థానం దక్కింది.
బిహార్ పై వరాల జల్లు
బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మఖానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం ఈ బోర్డు పని చేయనున్నట్లు తెలిపారు. మఖానా బోర్డు (Makhana Board) ద్వారా వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నట్లు వెల్లడించారు. రైతులు అన్ని ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందేలా బోర్డ్ సహకరిస్తుందని పేర్కొన్నారు.
బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్
మరోవైపు బిహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థిక సాయం అందిస్తామని నిర్మలమ్మ తెలిపారు. ఐఐటీ పట్నా సామర్థ్యాన్ని మరింత పెంచుతామని వెల్లడించారు. పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ (Green Filed Airport) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ ఏడాది చివరలో ఎన్నికలు
బిహార్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు (Bihar Polls 2025) జరగనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో సీఎం నీతీశ్ పార్టీ జేడీయూతో కలిసి బీజేపీ అధికారంలో ఉంది. జేడీయూ ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామి. బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పిన కేంద్రం.. ఎన్నికల ముందు పద్దులో వరాల జల్లు కురిపించింది.






