తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో (Telangana Assembly Special Session) భాగంగా సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో సుమారు 2 గంటలపాటు కేబినెట్ భేటీ జరిగింది. ఈ నివేదికలను మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు.
దేశంలోనే మొదటిసారి కుల గణన
దేశంలో మొదటిసారి కులగణన (Caste Census) చేసి చరిత్ర సృష్టించామని సీఎం రేవంత్ (CM Revanth Reddy) అన్నారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించినట్లు తెలిపారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామని వెల్లడించారు.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల (BC Reservation) ఖరారుపై కీలకంగా మారిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికను ప్రణాళిక శాఖ ఆదివారం బీసీ మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికను కేబినెట్ భేటీలో సమర్పించగా మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో వీటిని అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదం తెలపనున్నారు.







