దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata)కు అత్యంత ఆప్తుడు, స్నేహితుడు శాంతను నాయుడు (Shantanu Naidu) గురించి అందరికీ తెలిసిందే. టాటా మరణంతో ప్రపంచం ఎంతో దిగ్భ్రాంతి చెందగా అత్యంత బాధ పడిన వ్యక్తుల్లో ఒకడు శాంతను. ఇప్పటి వరకు టాటా ట్రస్ట్‌లో పిన్న వయస్కుడైన జనరల్ మేనేజర్‌గా, అసిస్టెంట్‌గా వ్యవహరించిన అతడికి తాజాగా టాటా సంస్థలో కీలక పదవి లభించింది.
శాంతను నాయుడికి కీలక బాధ్యతలు
రతన్ టాటా మరణానంతరం శాంతనుకు టాటా గ్రూప్ కీలక బాధ్యతలు అప్పగించింది. దేశీయ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors)లో స్ట్రాటజిస్ట్ ఇన్షియేటివ్స్ విభాగానికి హెడ్, జనరల్ మేనేజర్‌గా తాజాగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని శాంతను నాయకుడు స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
లైఫ్ కమ్స్ ఇన్ ఏ ఫుల్ సర్కిల్
‘టాటా మోటార్స్‌లో జనరల్ మేనేజర్, హెడ్- స్ట్రాటజిక్ ఇన్షియేటివ్ (Strategic Intiative)గా కొత్త ప్రయాణం మొదలు పెట్టాను. చాలా సంతోషంగా ఉంది. మా నాన్న టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెల్ల చొక్కా, నేవీ ప్యాంట్ వేసుకుని ఇంటికొచ్చేవారు. ఆయన కోసం కిటికీ వద్ద నిలబడి నేను ఎంతో ఆశగా ఎదురుచూసేవాడిని. ఇప్పుడు నేను ఇదే కంపెనీలో ఉన్నతస్థానంలో ఉన్నాను. ఇదంతా చూస్తుంటే జీవితం ఫుల్ సర్కిల్‌లోకి వచ్చినట్లు అనిపిస్తోంది.’ అంటూ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో శాంతను నాయుడు రాసుకొచ్చారు.
టాటాతో శాంతను ఫ్రెండ్షిప్
80 ఏళ్ల రతన్ టాటా (Ratan Tata Shantanu Naidu)కు.. రెండు పదుల వయస్సులో ఉన్న శాంతనుతో మంచి అనుబంధం ఏర్పడింది. 2018 నుంచి రతన్ టాటాకు శాంతను అసిస్టెంట్‌గా వ్యవహరించారు. వీళ్లిద్దరిని వీధి కుక్కలు కలిపాయట. ఇద్దరి మధ్య వయస్సులో చాలా గ్యాప్ ఉన్నా అది వారి మధ్య స్నేహం, వ్యాపార ఆలోచనలకు అడ్డురాలేదు. ఇద్దరు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. టాటా చివరి అంకం వరకు శాంతను ఆయనతో కలిసే ఉన్నారు.







