
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి(New Chief Minister of Delhi) రేపు ప్రమాణస్వీకారం(Oath) చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 12:05 గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతుందని కమలం పార్టీ స్పష్టం చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(Lieutenant Governor of Delhi) ముఖ్యమంత్రి చేత ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రాంలీలా మైదానం(Ramlila Maidan)లో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపింది. కొత్త సీఎం ఎంపిక కోసం ఈ సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని BJP కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు.
రేసులో ఉంది వీరే..
ఢిల్లీ సీఎం రేసులో ప్రధానంగా పర్వేశ్ వర్మ(Parvesh Varma), రేఖా గుప్తా(Rekha Gupta) పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఆశిష్ సూద్, శిఖా రాయ్, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్, జితేంద్ర మహాజన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మంత్రి పదవుల కోసం ఇప్పటికే దాదాపు 15 మంది పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి 20 రాష్ట్రాల CMలకు ఆహ్వానాలు అందాయి. 50 మంది సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. వీరితో పాటు బాబా రాందేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రితో పాటు పలువురు మత ప్రముఖులు హాజరుకానున్నారు.
కాగా ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP విజయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది. మెుత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) కేవలం 22 స్థానాలకే పరిమితమైంది.