జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా పిఠాపురంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రసంగం వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ స్పీచుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మాత్రం ఈ సభలో హిందీ భాషపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
ఎవరైనా చెప్పండి ప్లీజ్
‘మీ హిందీ (Hindi Language) భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ‘ఎవరైనా చెప్పండి ప్లీజ్’’ అంటూ ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆయన గతంలో కూడా తిరుమల లడ్డూ వ్యవహారం, సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హిందీ భాష అంశంపై చేసిన వ్యాఖ్యలకు కూడా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ పవన్ కు కౌంటర్ ఇచ్చారు.
ఇంతకీ పవన్ ఏం అన్నారంటే..?
జనసేన ఆవిర్భావ సభలో తమిళనాడు (Tamil Nadu Hindi Controversy) అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ అన్నీ దేశ భాషలే కదా అని వ్యాఖ్యానించారు. హిందీ వద్దు అంటున్న తమిళనాడు తమిళ సినిమాలను హిందీలోకి అనువదించొద్దని అన్నారు. హిందీ వాళ్ల డబ్బు కావాలి కానీ భాష వద్దంటే ఎలా అంటూ ప్రశ్నించారు. భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదని.. దేశానికి తమిళం సహా ఇతర భాషలు కావాలని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారని మండిపడ్డారు.
జస్ట్ ఆస్కింగ్
“ఏ రాష్ట్రంలో అయినా ముస్లిం సోదరులు అరబిక్లోనే ప్రార్థిస్తారు. కానీ ఎన్నడూ ఆ భాష తమకొద్దు అని వాళ్లనలేదు. రూపాయి సింబల్ మార్చేసి తమిళ భాష (Tamil Language)లో పెట్టుకోవటం ఏంటి? ఏ విషయమైనా కలిసి పరిష్కారం వెతుక్కోవాలి. విధ్వంసం చాలా తేలిక. నిర్మించటమే కష్టం.” అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇలా పవన్ హిందీ భాషపై చేసిన కామెంట్స్ పై ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ మరోసారి పవన్ పై ఆయన సెటైర్ వేశారు.






