తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం (Betting Apps Case) ఇప్పుడు కాక రేపుతోంది. ఈ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీసుకున్నారు. మరెంతో మంది యువత అప్పుల పాలై రోడ్డున పడ్డారు. ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ కొంతమంది సెలబ్రిటీలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారిపై తెలంగాణ పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పలువురు యూట్యూబర్లు, సినీ తారలకు నోటీసులు ఇచ్చింది.

మాకెలా తెలుస్తుందండి?
అయితే తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం, సినీ తారలకు నోటీసులు ఇవ్వడంపై నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) స్పందించింది. ఇన్ స్టా వేదికగా ఆమె ఓ పోస్టు చేసింది. ఈ వ్యవహారంలో అనన్యకు కూడా పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫొటో షేర్ చేసింది. మెట్రో రైలు (Hyderabad Metro)పై బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తూ ఓ పోస్టర్ అంటించి ఉన్న ఫొటోను అనన్య ఇన్ స్టాలో పంచుకుంది. ”ప్రభుత్వ ఆస్తి అయిన మెట్రోపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు. సర్కారు ఆస్తిపైనే ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు అవి ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అని మాకు ఎలా తెలుస్తుంది?” అంటూ అనన్య ప్రశ్నించింది.
View this post on Instagram
కాక రేపుతున్న బెట్టింగ్ యాప్స్ కేసు
ఇక దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అనన్య అడిగిన ప్రశ్నలో తప్పేం లేదు కదా అంటూ కొందరు ఈ నటికి సపోర్టుగా నిలుస్తున్నారు. మరికొందరేమో.. వాళ్ల సంగతి పక్కన బెడితే.. మీకు తెలుసు కదా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. మరి మీరెందుకు ప్రమోట్ చేశారంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంలో ఇటీవలే యూట్యూబర్లు హర్ష సాయి (Harsha Sai), బయ్యా సన్నీ యాదవ్‌లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. నోటీసులు అందుకున్న విష్ణుప్రియ, రీతూచౌదరి పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. మొత్తానికి బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది.






