ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ (Online Betting Apps) వల్ల ఎంతో మంది యువతీ యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. వీటికి బానిసై చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. అప్పుల పాలై చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవాళ్లకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ఈ యాప్స్ పై అధికారులు ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా లాభం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఈ యాప్స్ పై కొరడా ఝుళిపేందుకు తెలంగాణ పోలీసులు కంకణం కట్టుకున్నారు.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం
ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు. మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే బెట్టింగ్ యాప్స్ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారాన్ని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సీరియస్ గా పరిగణించనున్నట్లు సమాచారం.
సీసీపీఏకు ఫిర్యాదు
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు (Telangana High Court) న్యాయవాది కృష్ణకాంత్ సీసీపీఏకు ఫిర్యాదు చేశారు. “సాధారణంగానే బెట్టింగ్ యాప్స్ కు యువత అట్రాక్ట్ అవుతోంది. సరదాగా మొదలై ఇది వ్యసనంగా మారుతోంది. ఫలితంగా యువత తెలియకుండానే అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తీరా హోష్ లోకి వచ్చిన తర్వాత రోడ్డున పడుతున్నారు. అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
మూడేళ్ల పాటు నిషేధం
సెలబ్రిటీలు ఇలాంటి యాప్స్ లను ప్రమోట్ చేయడం వల్ల వాటికి మరింత విశ్వసనీయత ఏర్పడుతోంది. ఫలితంగా ఎక్కువ మంది వీటిని వినియోగిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందుకే దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.” అంటూ లాయర్ కృష్ణకాంత్ సీసీపీఏకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ నుంచి యువతను కాపాడాలంటూ కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీసీపీఏ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలెబ్రిటీలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
రూ.50లక్షల జరిమానా
ఈ వ్యవహారాన్ని గనుక CCPA సీరియస్ గా తీసుకుంటే ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ముందుగా ఇలాంటి యాడ్స్ ను మళ్లీ చేయకుండా వారిపై మూడేళ్ల పాటు బ్యాన్ విధించే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి ఎందరో జీవితాలు నాశనం అయ్యేందుకు పరోక్షంగా కారణమైనందుకు గానూ ప్రమోటర్లకు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం కూడా పరిశీలనలో ఉంది.






