బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ‘సికందర్’ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరూ ఈ మూవీ గురించి మాట్లాడలేదు. దీనిపై సల్మాన్ ఖాన్ తాజాగా స్పందించారు. ఈ క్రమంలో హిందీ పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేశారు. తనకూ సపోర్ట్ కావాలంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
నేను స్టార్ అయ్యే వాడిని కాదు
బాలీవుడ్ లో ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా సల్మాన్ ముందుంటారు. ముఖ్యంగా తన తోటి స్టార్స్ సినిమా ప్రచారాల్లో ఆయన పాల్గొంటూనే ఉంటారు. అయినా ఆయన నటించిన ‘సికందర్ (Sikandar)’ మూవీ గురించి ఎవరూ మాట్లాడలేదు. తాజాగా వీరి మౌనంపై సల్మాన్ (Salman Khan on Bollywood) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు కూడా మద్దతు కావాలని అన్నారు. ఇక తనకు పనిపై నిబద్ధత లేదంటూ వచ్చిన కథనాలపై స్పందిస్తూ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ భాగం అవుతానని అన్నారు. నిబద్ధత లేకపోతే స్టార్ అయ్యే వాడిని కాదని తెలిపారు.
నాకూ సపోర్ట్ కావాలి
‘‘బాలీవుడ్‌లోని నటులంతా నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని అనుకున్నట్టు ఉన్నారు. అందుకే ఎవరూ నా మూవీ సికందర్ విషయంలో స్పందించలేదు. కానీ ప్రతి మనిషికి సపోర్టు కావాలి. అలాగే నాకూ మద్దతు కావాలి.’’ అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఇక రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన సికందర్ రిలీజ్ కు ముందు ఆమిర్ ఖాన్, సన్నీదేవోల్‌లు మాత్రమే ఈ చిత్రంపై పోస్ట్‌లు పెట్టారు. మరోవైపు విడుదలకు ముందు దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో కలిసి ఆమిర్‌ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇద్దరూ మినహా బాలీవుడ్ స్టార్స్ ఎవరూ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయలేదు.






