టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఓవైపు బాలీవుడ్ మరోవైపు టాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ముఖ్యంగా బీ టౌన్ లో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ అక్కడి ఆడియెన్స్ కు బాగా దగ్గరయింది. ఇక తాజాగా తెలుగులో ఓదెల-2 (Odela 2) చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శివశక్తి పాత్రలో ఈ చిత్రంలో తన నటనతో మెస్మరైజ్ చేయనుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఏప్రిల్ 17వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ లో జోరు పెంచింది.
పెళ్లిపై తమన్నా కామెంట్స్
తాజాగా ఓదెల-2 ప్రమోషన్స్ లో పాల్గొన్న తమన్నా భాటియాకు మీడియా నుంచి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నాను హోస్టు.. మీరెప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని అడిగిన ప్రశ్నకు మిల్కీ బ్యూటీ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతానికి తనకు పెళ్లి ఆలోచన లేదని.. కెరీర్ పైనే ఫోకస్ పెడుతున్నానని తమన్నా చెప్పుకొచ్చింది. అయితే వివాహం విషయంలోనే విజయ్ వర్మ (Vijay Varma)తో బ్రేకప్ అయినట్లు బీ టౌన్ మీడియా కోడై కూసిన వేళ టామీ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
అదే పెద్ద సినిమా అవుతుంది
ఇక ఇదే ఇంటర్వ్యూలో ‘ఆఫర్లు లేకపోవడంతోనే చిన్న సినిమాల్లో నటిస్తున్నారా? అని హోస్టు ప్రశ్నించగా తన దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా ఉండదని, కంటెంట్ బాగుండి మూవీ బాగా వస్తే అదే పెద్ద చిత్రం అవుతుందని చెప్పుకొచ్చింది తమన్నా. ఇప్పటివరకూ సినిమాల్లో అమ్మాయిలను డాక్టర్‌గా, పోలీస్ ఆఫీసర్‌గా డిఫరెంట్ రోల్స్‌లో చూశాం.. కానీ శివశక్తి వంటి పాత్రను ఏ డైరెక్టర్ వెండితెరపై చూపించలేదని తెలిపింది. ఇది ఓ పెద్ద బాధ్యత అని.. శివశక్తులు ఎలా ఉంటారో ప్రజలకు తెలియాలనే ఈ చిత్రం తీసినట్లు వెల్లడించింది. ఈ సినిమా చూస్తే ప్రేక్షకులు చాలా థ్రిల్ కు గురవుతారని చెప్పుకొచ్చింది తమన్నా.






