జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్(Pahalgam Terror Attack)లో జరిగిన ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. దాడి వెనక పాకిస్తాన్ ఉగ్రవాదుల హస్తం ఉందనే వాదనలు వినిపిస్తుండటంతో దాయాది దేశానికి సంబంధించిన ప్రతి అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆ దేశ నటుడికి సంబంధించిన సినిమా బ్యాన్ చేయాలంటూ ఇప్పుడు నెట్టింట పెద్దఎత్తున వార్ మొదలైంది. ఇంతకీ ఆ నటుడు ఎవరు.. ఆ సినిమా ఏంటి.. ఆ సంగతులేంటో చూద్దాం.
ఆ సినిమా బ్యాన్ చేయాలి
కొన్నేళ్ల క్రితం ఇండియాలో పాక్ నటులు, కళాకారులను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆ బ్యాన్ తొలగిపోవడంతో ఆ దేశానికి చెందిన నటులు మళ్లీ భారతీయ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అందులో ఒకరే పాక్ నటుడు ఫవాద్ ఖాన్. ఇప్పటికే ఫవాద్ ఖాన్ (Fahawad Khan) బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. బ్యాన్ తొలగింపు అనంతరం ఆయన హీరోగా మళ్లీ ఓ సినిమా వస్తోంది. వాణీకపూర్ (Vani Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాయే ‘అబిర్ గులాల్ (Abir Gulaal)’. మే 9వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.
అబిర్ గులాల్ బ్యాన్
అయితే ఫహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై ఉవ్వెత్తున జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ నెట్టింట పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇది బాలీవుడ్ సినిమాయే అయినా.. పాకిస్తాన్ నటుడు ఉన్నందున దీన్ని బ్యాన్ చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాన్ అబిర్ గులాల్ (#Ban Abir Gulal), బ్యాన్ ఫవాద్ ఖాన్, బ్యాన్ పాకిస్తాన్ అనే హ్యాష్ ట్యాగ్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో ఈ సినిమా రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. దీనిపై మూవీ టీమ్ స్పందించాల్సి ఉంది.






