ఆకాశంలో సగం.. అవకాశంలో సగం అంటూ.. అబ్బాయిలు, అమ్మాయిలు సమానం అనే మాట రోజు వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించదు. ఇప్పటికీ ఆడపిల్ల పుడితే ఏడ్చే వాళ్లు.. చెత్తకుప్పలో పసిపిల్లలను పడేసేవాళ్లు ఉన్నారు. ఆడపిల్లను కన్నారని భార్యలను వేధించే భర్తలూ ఉన్నారు. మగపిల్లాడి కోసం రెండో పెళ్లి చేసుకున్న వారూ ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కానీ రెండో భార్యకూ ఆడపిల్లే పుట్టడంతో ఆ వ్యక్తి ఏకంగా భార్యనే చంపేశాడు.
అసలేం జరిగిందంటే..?
జిల్లాలోని కాగజ్ నగర్ మండలం వంజిరలో జయరామ్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఆడపిల్ల పుట్టడం.. ఆ తర్వాత ఆమెకు ఇక పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పడంతో జయరామ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. కేవలం మగపిల్లాడి కోసమే అతడు రెండో వివాహం చేసుకున్నాడు. అయితే రెండో భార్యకు కూడా వరుసగా ఇద్దరు అమ్మాయిలే పుట్టారు. దీంతో ఇద్దరికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
భార్యను చంపి పరార్
బుధవారం రాత్రి కూడా ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన జయరామ్ వ్యవసాయానికి ఉపయోగించే పలుగుతో రెండో భార్య తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరక్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న జయరామ్ కోసం గాలిస్తున్నారు.






