జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం అప్రమత్తమైంది. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు ఇంకా పలు ప్రాంతాల్లో నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం నుంచి కొనసాగుతున్న ఈ కూంబింగ్ లో తాజాగా భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఉదమ్‌పుర్ లో ఉగ్రవేట
జమ్మూకశ్మీర్ లోని ఉదమ్‌పుర్ (Udhampur)లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భధ్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే దుడు-బసంత్‌గఢ్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో ఓ సైనికుడు అమరుడయ్యాడని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ వెల్లడించింది (Udhampur Encounter).
భారత సైనికుడి వీరమరణం
నిఘా సమాచారంతో ఉదమ్పుర్లోని బసంత్‌గఢ్‌లో సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి ఉగ్రవాదులను ఏరివేసేందుకు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల ఆనవాళ్లు కనిపించడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఉగ్రవాదులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో తూటాలు తగిలి ఓ సైనికుడు గాయపడ్డాడు. చికిత్స పొందుతూ జవాన్ మరణించాడని ఆర్మీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ కొనసాగుతోంది.






