ఇటీవల విడుదలై ప్రేక్షకులే కాదు ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది తమిళ్ మూవీ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family). అభిషాన్ జీవింత్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు మెచ్చుకున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) దీనిపై ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చారు.
అద్భుతమైన సినిమా చూశాను
‘టూరిస్ట్ ఫ్యామిలీ ప్రారంభం నుంచి చివరి సన్నివేశం వరకూ ఎంతో ఆసక్తిగా ఉంది. హృదయాన్ని కదిలించింది. కడుపుబ్బా నవ్వించింది. అభిషాన్ గొప్పగా రచించి డైరెక్షన్ చేశారు. అద్భుతమైన సినిమా చూశాను. ఇటీవల కాలంలో చూసి బెస్ట్ సినిమా ఇది. మీరంతా కూడా కచ్చితంగా చూడండి’ అని పోస్ట్ పెట్టారు.
ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: దర్శకుడు
తన సినిమాను రాజమౌళి ప్రశంసించడంపై డైరెక్టర్ అభిషాన్ జీవింత్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. రాజమౌళి సినిమాలను ఎంతో ఆశ్చర్యంగా చూసేవాడిని. అలాంటిది ఆయన నా సినిమాను ప్రశంసించారు. నా పేరు పలికారు. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు’ అని పోస్ట్ పెట్టారు.
రజనీకాంత్, వకార్తికేయన్ ప్రశంసలు
మే 1న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ విజయవంతంగా థియేటర్స్లో రన్ అవుతోంది. ఇటీవలే ఈ సినిమాను రజనీకాంత్ ప్రశంసించారు. యంగ్ హీరో శివకార్తికేయన్ ఈ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.






