టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో కీలక అడుగు వేశారు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ ద్వారా ఇప్పటికే అనేక హిట్ చిత్రాలను అందించిన ఆయన, ఇప్పుడు ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే కొత్త బ్యానర్ ప్రారంభించారు. ఈ బ్యానర్ తో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు, నూతన కథలకు వేదిక కల్పించేందుకు ప్రారంభించారు. తాజాగా ఈ బ్యానర్‌కు సంబంధించిన లోగోను అధికారికంగా విడుదల చేశారు.
కొత్త కథలకు, చిన్న సినిమాలకు ప్రాధాన్యం
దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ ద్వారా లో-బడ్జెట్ సినిమాలు, కొత్త కంటెంట్ ఉన్న ప్రాజెక్టులకు అవకాశం కల్పించనున్నారు. కొత్త దర్శకులు, నటులు, రచయితలు వంటి టాలెంట్‌కి ఇది ఒక ఉత్తమ వేదికగా నిలవనుందని దిల్ రాజు చెబుతున్నారు. కాగా దిల్ రాజు అసలు పేరు వి. వెంకట రమణా రెడ్డి. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, ‘దిల్’ సినిమా ఘన విజయం సాధించడంతో దిల్ రాజు అనే పేరుతో నిర్మాతగా వెలుగులోకి వచ్చారు. అప్పటి నుంచి ఒకటిన్నర దశాబ్దంగా స్టార్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు.

కష్టపడే టాలెంట్‌కు తగిన వేదిక
ఇంతకుముందు తన అనుభవాలను గుర్తుచేసుకుంటూ దిల్ రాజు మాట్లాడుతూ, “నాకు కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలొచ్చాయి. ఇండస్ట్రీకి రావాలనుకునే వారికి సరైన అవకాశం దొరకదు. అలాంటి వారికి ‘దిల్ రాజు డ్రీమ్స్’ వేదికగా ఉంటుంది. టాలెంట్, కంటెంట్ ఉన్నవారు మా టీమ్‌ను సంప్రదించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించాం,” అని తెలిపారు.
వెబ్‌సైట్ ప్రారంభం, రిజిస్ట్రేషన్లు షురూ..
తాజాగా https://dilrajudreams.com అనే వెబ్‌సైట్‌ను లాంచ్ చేసి, అఫీషియల్‌గా రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్లు దిల్ రాజు ప్రకటించారు. కొత్త టాలెంట్ తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ కొత్త ప్రయోగం ద్వారా ఇండస్ట్రీలోకి కొత్త రక్తాన్ని తీసుకురావాలన్న దిల్ రాజు ఆలోచన అభినందనీయమైనదిగా చెబుతున్నాయి సినీ వర్గాలు.






