
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కొనసాగింది. కాస్త గ్యాప్ ఇచ్చి.. మళ్లీ తిరిగి గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ (Department of Meteorology) హెచ్చరించింది. రానున్న ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లోనూ ఈదురుగాలుల తాకిడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. .
సదాశివపేట మండలంలో అత్యధికంగా 8.64 సెం.మీ. వాన
గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో అత్యధికంగా 8.64 సెం.మీ వర్షపాతం నమోదనట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వరంగల్ జిల్లా కల్లెడలో 8.4 సెంటీమీటర్లు, అదే జిల్లా మంగళవారిపేటలో 7.7, నల్గొండ జిల్లా తిరుమలగిరిలో 7.7, మహబూబాబాద్జిల్లా కొత్తగూడలో 7.4, వరంగల్జిల్లా చెన్నారావుపేటలో 6.7, సూర్యాపేట జిల్లా బలరాం తండాలో 6.7, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 6.6, కామారెడ్డి జిల్లా బోమనదేవిపల్లిలో 6.3, నల్గొండ జిల్లా నకిరేకల్‌లో 6, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్, మెదక్ జిల్లా మాసాయిపేటల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.