వరుస వెబ్ సిరీస్లతో దూసుకుపోతోంది కథానాయిక ప్రియమణి (Priyamani). ది ఫ్యామిలీమెన్, భామాకలాపం, సర్వం శక్తిమయం వంటి సిరీస్లతో ఆకట్టుకున్న ప్రియమణి.. ఇప్పుడు మరో సిరీస్లో నటించింది. ఆమె లీడ్ రోల్ పోషించిన మరో వెబ్ సిరీస్ గుడ్ వైఫ్ (Good Wife) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మేకర్స్ మంగళవారం అధికారిక ప్రకటన చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. త్వరలో జియో హాట్‌స్టార్ (JioHotstar) వేదికగా స్ట్రీమింగ్‌కు తీసుకు రానున్నట్లు తెలిపారు. ప్రియమణితో పాటు రేవతి, సంపత్ రాజ్, ఆరి అర్జునన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
లీగల్ థ్రిల్లర్ అధారంగా..
దశాబ్దం క్రితం అమెరికన్ టీవీల్లో వచ్చిన గుడ్ పైఫ్ (Good Wife) అనే లీగల్ థ్రిల్లర్ అధారంగా తమిళంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న తన భర్తను రక్షించేందుకు ఓ మాజీ లాయర్ చేసిన పోరాటం నేపథ్యంలో థ్రిల్లింగ్, ఎమోషనల్ డ్రామాగా రూపొందించారు. మరో వారంలో ఈ సిరీస్ టీజర్ను రిలీజ్ చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగు మరో 5 భాషల్లో విడుదల చేయనున్నారు.






