బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా (Vijay Mallya) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను దొంగను కాదన్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే భారత్‌ను వీడానని పేర్కొన్నారు. తాజాగా ఓ పోడ్కాస్ట్లో మాట్లాడారు. తాను ఎలాంటి దొంగతనం చేయలేదన్నారు. తాను భారత్ నుంచి పారిపోయానని.. కానీ దొంగను కానని అన్నారు. అసలు దొంగతనం ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. 2008లో ఆర్సీబీ (RCB) ఫ్రాంచైజీని ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో, అప్పటి యువ ఆటగాడు విరాట్ కోహ్లీని జట్టులోకి ఎలా తీసుకున్నారో తెలిపారు.
అలా RCBని దక్కించుకున్నా..
లలిత్ మోదీ ఐపీఎల్ గురించి వివరించిన తర్వాతే తనకు ఈ లీగ్‌పై ఆసక్తి కలిగిందని విజయ్ మాల్యా అన్నారు. ‘ఓ రోజు లలిత్ మోదీ తనకు ఫోన్ చేసి, ఐపీఎల్ జట్లను వేలం వేస్తున్నారని, మీరు కొనుగోలు చేస్తారా? అని అడిగారని పేర్కొన్నారు. తొలుత తాను మూడు ఫ్రాంచైజీల కోసం బిడ్ వేసినప్పటికీ.. ముంబై జట్టును తృటిలో కోల్పోయి, చివరికి బెంగళూరు ఫ్రాంచైజీని దక్కించుకున్నట్లు చెప్పారు. క్రికెట్‌పై ఉన్న అమితమైన ఇష్టంకొద్దో, లేక తన విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శించుకోవడానికో ఆర్సీబీని కొనుగోలు చేయలేదన్నారు. వ్యాపారం కోసమే కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. ‘నా ప్రాథమిక ఉద్దేశం వ్యాపారమే. రాయల్ ఛాలెంజ్, కింగ్‌ఫిషర్ వంటి నా బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడానికే ఆర్సీబీని కొన్నాను’ అని పేర్కొన్నారు.
కోహ్లీ యువకుడిగా ఉన్నప్పుడే..
ఐపీఎల్ ఆరంభ వేలంలో విరాట్ కోహ్లీని (Virat Kohli) ఎంచుకోవడం తన అత్యంత ప్రభావవంతమైన నిర్ణయాల్లో ఒకటని మాల్యా తెలిపారు. ‘నేను ఆర్సీబీని స్థాపించినప్పుడు, ఏదో ఒకరోజు ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరుకు రావాలని కలలు కన్నాను. లెజెండరీ కింగ్ కోహ్లీని యువకుడిగా ఉన్నప్పుడే ఎంచుకునే అదృష్టం నాకు దక్కింది. అతను 18 ఏళ్లుగా ఆర్సీబీతోనే ఉండటం విశేషం’ అని మాల్యా అన్నారు. 2008లో సుమారు 111.6 మిలియన్ అమెరికన్ డాలర్లకు (అప్పటి విలువ ప్రకారం దాదాపు రూ.600-700 కోట్లు) ఆర్సీబీని కొనుగోలు చేశానని, ఇప్పుడది ఒక అత్యుత్తమ పెట్టుబడి అని ఆయన అభివర్ణించారు.






