తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న నటి ప్రియాంక జైన్(Priyanka Jain), ఇప్పుడు నిజజీవితంలోనూ కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. ‘మౌనరాగం’ సీరియల్‌తో తెలుగువారికి దగ్గరైన ఈ ముద్దుగుమ్మ, తర్వాత బిగ్‌బాస్(BiggBoss) తెలుగు 7వ సీజన్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ప్రియాంక కెరీర్‌లో కీలక మలుపు ‘మౌనరాగం’ సీరియల్‌తో వచ్చింది. స్టార్ మా చానెల్ లో ప్రసారం అయిన ఈ సీరియల్‌లో ‘అమ్మూలు’ అనే పాత్రలో ఆమె నటన ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ఈ సీరియల్ 600 ఎపిసోడ్లకు పైగా ప్రసారం కాగా, ప్రతి రోజు ప్రేక్షకులు ఆమె నటనను ఆదరించారు.

ప్రియాంక జైన్ గత కొంతకాలంగా నటుడు శివ్ కుమార్‌తో ప్రేమలో ఉంది. ఇద్దరూ కలసి నటించిన ‘మౌనరాగం’ సీరియల్ తో వీరి ప్రేమ మొదలైంది. అప్పటినుంచి తరచూ కలిసి కనిపిస్తూ వచ్చిన ఈ ప్రేమ పక్షులు అధికారికంగా నిశ్చితార్థ దశలోకి వెళ్లారు.
ప్రియాంక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్. యూట్యూబ్‌లో ‘Never Ending Tales’ అనే ఛానెల్ నిర్వహిస్తోంది. ఇందులో తన జీవిత శైలికి సంబంధించిన వ్లాగ్స్, ఫన్నీ కంటెంట్, లైఫ్ అప్‌డేట్స్ షేర్ చేస్తుంది. ఆమె ప్రేమికుడు శివకుమార్‌తో కలిసి చేసే వీడియోలు ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతుంటాయి.

జూన్ 8న శివ కుమార్(Shiva Kumar) పుట్టినరోజు సందర్భంగా ప్రియాంక అతడిని అండమాన్ నికోబార్ ద్వీపాలకు తీసుకెళ్లింది. అక్కడ బీచ్ సైడ్‌లో గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది. అయితే ఆ వేడుకలో అసలైన హైలైట్ ఏంటంటే.. ప్రియాంక తన ప్రేమను వ్యక్తం చేసింది.
అప్పటిదాకా చిరునవ్వులతో ప్యారడైజ్‌లో విహరిస్తున్న ఈ జంట.. అకస్మాత్తుగా ప్రియాంక మోకాలిపై కూర్చుని “నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని అడగడం, శివ్ ‘తప్పకుండా’ అని సమాధానమిస్తూ ఆమెను హత్తుకుని ఆనందంగా కౌగిలించుకోవడం అక్కడున్న వారిని మైమరిపించింది.
![]()
ఈ ప్రత్యేక సందర్భానికి గుర్తుగా ప్రియాంక తన చేతితో శివ కుమార్ వేలికి రింగ్ తొడిగింది. అనంతరం ఈ క్షణాలను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ప్రేమజంట ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
“నా కాబోయే జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు అధికారికంగా నువ్వు నావాడివి. మన ప్రయాణం సాఫీగా సాగలేదేమో కానీ, ప్రతి రోజు గొప్పగా ఉండేలా చేసుకుందాం. జీవితాంతం కలిసి ఉండాలని ఆశిస్తున్నా.” అంటూ పోస్ట్ చేసింది.






