
ప్రేమించి కులాంతర వివాహం (Intercaste Marriage) చేసుకున్న ఓ యువతి కుటుంబానికి అత్యంత చేదు అనుభవం ఎదురైంది. కులాంతర వివాహం చేసుకోవడంతో ఊరి నుంచి వెలిని తప్పించుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు 40 మంది శిరోముండనం చేయించుకోవాల్సి వచ్చింది. ఈ అమానవీయ ఘటన ఒడిశా(Odisha)లోని రాయగడ జిల్లా జరిగింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల వివరాల ప్రకారం.. కాశీపూర్ సమితిలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి, గోరఖ్పూర్ పంచాయతీలోని షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. యువతి తరఫు వారు వారి వివాహానికి అంగీకరించకపోవడంతో ఇద్దరూ మూడు రోజుల క్రితం పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
ఊరి కట్టుబాట్ల ప్రకారం..
పెళ్లి చేసుకున్నాం కదా.. అనే ధైర్యంతో ఆ జంట గురువారం యువతి గ్రామానికి చేరుకుంది. అయితే అప్పటికే వీరి విషయం తెలిసి గుర్రుమీద ఉన్న ఆ గ్రామ పెద్దలు.. ఊరి కట్టుబాట్ల ప్రకారం యువతి కుటుంబసభ్యులను వెలివేశారు. అయితే ఈ వెలి నుంచి తప్పించుకోవాలంటే పలు షరతులు విధించారు. శిక్షగా కుటుంబసభ్యులంతా శిరోముండనం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా మూగ జీవాలను బలిచ్చి, కొత్త జంటకు పెద్దకర్మ చేయాలని ఆదేశించారు. దీంతో చేసేదేంలేక యువతి కుటుంబసభ్యులు, బంధువులు 40 మంది పురుషులు గుండు చేయించుకుని మేక, గొర్రె, కోడి, పావురాలను బలిచ్చారు. ఆ ప్రేమ జంటకు పెద్ద కర్మ చేశారు. ఈ ఘటనపై పోలీసులను ప్రశ్నించగా తమకు ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు.