
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం (Iran-Israel War) తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న పేలుళ్లతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran) నగరం దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారత పౌరులను మన ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ‘‘టెహ్రాన్‌లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ తమ తమ సొంత మార్గాల్లో ఈ నగరాన్ని వీడండి. టెహ్రాన్ బయట సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వండి. మీరు ఉంటున్న లొకేషన్లు, మొబైల్ నంబర్లను పంచుకోండి’’ అని ఇరాన్‌లోని భారత ఎంబసీ తమ అడ్వైజరీలో వెల్లడించింది.
చిక్కుకుపోయిన 10 వేల మంది
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియాలోని పలు దేశాల్లో గగనతలాలపై ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్ భారీ క్షిపణి దాడులకు పాల్పడుతుండడంతో ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. లెబనాన్, జోర్డాన్, ఇరాక్‌లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు మూతపడటంతో వేలాది మంది ప్రయాణికులు అక్కడే చిక్కుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 10వేలకు పైగా ప్రయాణికులు ఇరాన్ సహా పశ్చిమాసియాలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్లు ఓ భద్రతా నిపుణుడు పేర్కొన్నారు.
⚠️
All Indian Nationals who are in Tehran and not in touch with the Embassy are requested to contact the Embassy of India in Tehran immediately and provide their Location and Contact numbers.Kindly contact: +989010144557; +989128109115; +989128109109@MEAIndia
— India in Iran (@India_in_Iran) June 17, 2025