టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’(Kubera) ఈ నెల 20న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika) కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్న నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించినట్టు సమాచారం. సినిమా చూసిన వెంటనే ఆయన నాగార్జున, ధనుష్, శేఖర్ కమ్ముల సహా మొత్తం మూవీ టీమ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారట.
ఈ నేపథ్యంలో ఈ రోజు కుబేర సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు మేకర్స్. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ సినీ వర్గాల్లో ఈ టాక్ వినిపిస్తోంది. అభిమానుల సమక్షంలో కాకుండా, పూర్తిగా ప్రైవేట్‌గా ఈ వేడుకను నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ‘కుబేర’ బ్లాక్ బస్టర్ టాక్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు మేకర్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారట.
మరోవైపు తొలిరోజే భారీ రెస్పాన్స్ అందుకున్న కుబేర సినిమా సెకండ్ డే కూడా అదే రేంజ్ లో దూసుకుపోయింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాపై పాజిటివ్ గా స్పందిస్తుండటం విశేషం. మరీ ముఖ్యంగా ధనుష్ డేరింగ్ రోల్, నాగార్జున నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. చూస్తుంటే కుబేర సినిమా భారీ లాభాలు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






